Karimnagar: మానేరు రివర్ ఫ్రంట్‌కు కొత్త శోభ.. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 10:57 AM IST
Karimnagar
X

Karimnagar: మానేరు రివర్ ఫ్రంట్‌కు కొత్త శోభ.. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ : నగరానికి మరింత అందం చేకూర్చే మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు ఆదేశించారు. మిగిలిన పెండింగ్ పనులను (బ్యాలెన్స్ వర్క్స్) త్వరితగతిన పూర్తి చేసి, ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటివరకు పూర్తైన పనులు, ఇంకా మిగిలిన పనుల స్థితి, అవసరమైన బడ్జెట్, భూ సేకరణ పురోగతి వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, మిగిలిన పనులను బడ్జెట్ ప్రకారం చేపట్టాలని స్పష్టం చేశారు. బ్యూటిఫికేషన్ వర్క్స్, రైలింగ్, గార్డెనింగ్ వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ద్వారా కరీంనగర్ నగరానికి కొత్త శోభ చేకూరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇరిగేషన్, టూరిజం కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా బైపాస్ రోడ్డు నుంచి మానేరు రివర్ ఫ్రంట్ వరకు రోడ్డు కనెక్టివిటీ పనులను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ఇరిగేషన్ ఈఈ సదయ్య, డీఈలు, తహసీల్దార్లు శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, టూరిజం కార్పొరేషన్ ఏఈ జీవన్ రెడ్డి పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story