Manthani: మంథని అభివృద్ధికి ఐదు కీలక పనులు.. మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
Manthani: మంథని అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రోత్సాహం కోసం ఐదు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును గుండా రాజు కోరారు.
Manthani: మంథని అభివృద్ధికి ఐదు కీలక పనులు.. మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
మంథని: మంథని పట్టణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక పర్యాటక రంగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఐదు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గుండా రాజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంథని గోదావరి పుష్కర ఘాట్ వద్ద భారీ శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, పుష్కర ఘాట్‌కు దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు పెట్టాలని కోరారు. అలాగే బోయినిపేటలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు లక్ష్మీ దేవర ఆలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని, గ్రామంలో పల్లె దవాఖానాకు నూతన భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
మంథని గోదావరి పుష్కర ఘాట్‌ను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు, పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చని గుండా రాజు తెలిపారు. అదేవిధంగా బోయినిపేటలో తాగునీరు, వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రతిపాదిత పనులు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.
ఈ వినతిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి, త్వరలోనే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గుండా రాజు వెల్లడించారు.




