Manthani: పుట్ట మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు
Manthani: మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యాఖ్యలను మంథని కాంగ్రెస్ నేతలు ఖండించారు. రూ.40 లక్షలతో కొత్త పాఠశాల భవనం మంజూరు చేశామని స్పష్టం చేశారు.
Manthani: పుట్ట మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు
మంథని: మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రభుత్వ పాఠశాల భవనం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలను మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మంథని పట్టణ అధ్యక్షుడు నాగేల్లి జానీ తీవ్రంగా ఖండించారు.
గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...సంబంధిత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లారని తెలిపారు.
దీంతో పాత భవనాన్ని తొలగించి, రూ.40 లక్షల నిధులతో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ ఆర్డర్లు జారీ చేయించినట్లు వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా పుట్ట మధు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికి కాకుండా అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
అలాగే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌ను ఉన్నతాధికారులు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వచ్చే అధికారుల బస కోసం ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో కుచిరాజుపల్లె ఎస్సీ కాలనీలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదని పుట్ట మధును ప్రశ్నించారు. ముందుగా ఆ ఇళ్లను పూర్తి చేసి, అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మంత్రి పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. పుట్ట మధు తన ఐదేళ్ల పదవీకాలంలో నిర్మించుకున్న రాజగృహం, ఫామ్‌హౌస్‌తో పాటు వందల ఎకరాల ఆస్తులు ఎలా సమకూరాయో నియోజకవర్గ ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.
మంథని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మంథని మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో శ్వేతపత్రం రూపొందిస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పెంటరి రాజు, నూకల కమల్, ఎరుకల స్రవంతి రమేష్ బాబు, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, గౌతమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గుండా రాజు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఆరేళ్ల కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




