Manthani: మంథనిలో బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణ పనులు ప్రారంభం

Manthani: మంథనిలో రూ.2 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణ మరియు కట్ట సుందరీకరణ పనులకు సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమిపూజ చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 3 Aug 2026 2:12 PM IST
Manthani
X

Manthani: మంథనిలో బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణ పనులు ప్రారంభం

మంథనిలో బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణకు శ్రీకారం

రూ.2 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో కట్ట సుందరీకరణ, వాక్‌వే, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

Manthani పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణతో పాటు కట్ట సుందరీకరణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం శ్రీకారం చుట్టారు. కోకాకోలా కంపెనీ సీఎస్‌ఆర్ నిధుల కింద రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోకాకోలా సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంథని అభివృద్ధికి సహకరించాలని కోకాకోలా కంపెనీ ప్రతినిధులను కోరగా, వారు సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. బొక్కలవాగులో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని, దీంతో చెక్‌డ్యాం నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు వర్షాకాలంలో నీటి సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

చెక్‌డ్యాం కట్టను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా ప్రజలు నడక కోసం ప్రత్యేక వాక్‌వే, చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్క్, పచ్చదనం పెంపు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రజలకు మెరుగైన వినోద, విశ్రాంతి వసతులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర పట్టణాల తరహాలోనే మంథనిని అన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story