Manthani: వెంకటాపూర్ వైకుంఠధామంలో సోలార్ ప్యానెళ్లు చోరీ

Manthani: మంథని వెంకటాపూర్ వైకుంఠధామంలో లక్షల విలువైన సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు చోరీ. నిందితులను పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేసిన గ్రామస్థులు.

SHANKAR, MANTHANI
Published on: 1 Aug 2026 5:32 AM IST
Manthani
X

Manthani: వెంకటాపూర్ వైకుంఠధామంలో సోలార్ ప్యానెళ్లు చోరీ

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఒడ్డున ఉన్న స్మశాన వాటికలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లు, బ్యాటరీలు, చార్జింగ్ సిస్టమ్ చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులతో లక్షల రూపాయల వ్యయంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు.

వైకుంఠధామంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో కూడా డీప్ ఫ్రీజర్ నిరంతరాయంగా పనిచేసి మృతదేహాలను భద్రపరిచేలా సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే గుర్తుతెలియని దుండగులు స్మశాన వాటికలో ఎవరూ లేని సమయంలో సోలార్ ప్యానళ్లు, బ్యాటరీలు, చార్జింగ్ పరికరాలను దొంగిలించినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఈ చోరీతో అత్యవసర పరిస్థితుల్లో మృతదేహాలను భద్రపరచడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమీప అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన సోలార్ బోర్ పంపు మోటారును కూడా ఇదే తరహాలో దొంగిలించిన ఘటనను గుర్తుచేస్తూ, అదే ముఠా ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు వెంటనే విచారణ చేపట్టి నిందితులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దొంగిలించిన సామాగ్రిని స్వాధీనం చేసుకుని స్మశాన వాటికకు తగిన భద్రత కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story