Karimnagar: ఆసరా ఫౌండేషన్ 2వ వార్షికోత్సవం: 'మట్టి గణపతి' పోస్టర్ ఆవిష్కరణ!
Karimnagar: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Karimnagar: ఆసరా ఫౌండేషన్ 2వ వార్షికోత్సవం: 'మట్టి గణపతి' పోస్టర్ ఆవిష్కరణ!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆసరా ఫౌండేషన్ (ఆపదలో సహాయానికి రా) ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఆసరా ఫౌండేషన్ నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను అభినందించారు. మొక్కలు నాటడం, పచ్చదనం–పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, ఓటరు అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సంస్థ సమాజ సేవలో ముందుకు సాగడం అభినందనీయమన్నారు.
ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి రక్తదానం ద్వారా సహాయం అందించడంలో ఆసరా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మేయర్ కొనియాడారు. సేవా కార్యక్రమాలను ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలి
రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆసరా ఫౌండేషన్ రూపొందించిన “మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” వాల్ పోస్టర్‌ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజలందరూ వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోతాయని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పోలిస్తే పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. సాధ్యమైనంత వరకు ఇంటివద్దనే మట్టి వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసుకుని, అనంతరం ఆ మట్టిని పూల మొక్కలు, మొక్కల పెంపకానికి వినియోగించుకోవచ్చని ప్రజలకు సూచించారు.
వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, “మట్టి వినాయకుడు – పర్యావరణానికి మేలు” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేయర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆర్. గోపి కృష్ణ, సంస్థ సభ్యులు కె. ప్రవీణ్, జి. తిరుపతి, ఎం. రవి చందర్, వి. అద్వైత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.




