Karimnagar: ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య!

Karimnagar: కరీంనగర్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య పరీక్షల్లో ఫెయిల్ కావడంతో అధిక మోతాదులో మాత్రలు మింగిన పునీత్ వర్మ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Sept 2026 7:52 PM IST
Karimnagar
X

Karimnagar: ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య!

కరీంనగర్: ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మానసిక వేదనకు గురైన ఓ విద్యార్థి అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామానికి చెందిన లారీ మెకానిక్ కుమారుడు నాగడి పునీత్ వర్మ (28)కు 2019 సంవత్సరంలో కౌన్సెలింగ్ ద్వారా ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు లభించింది. దీంతో కరీంనగర్‌లోని బొమ్మకల్ ప్రాంతంలో ఉన్న చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంబీబీఎస్‌లో చేరాడు. 2025 సంవత్సరంలోనే ఎంబీబీఎస్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, పునీత్ వర్మకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉండటంతో కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు.

ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కుమారుడి మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతని తల్లిదండ్రులు శంకర్ బాబు మరియు ఆయన భార్య కృష్ణా జిల్లా నుంచి కరీంనగర్‌కు వచ్చి, కళాశాల సమీపంలోని గుంటూరుపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని కుమారుడి వద్దే ఉంటున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడం, మానసిక వేదనతో పునీత్ వర్మ అధిక మోతాదులో బెంజోడియాజిపైన్‌ తరహా మాత్రలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తము ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈరోజు సుమారు 6:30 గంటలు నుండి 7 గంటల మధ్యలో చనిపోయినాడు అని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అంత్యక్రియల నిమిత్తం మృతుని తండ్రి శంకర్ బాబుకు మృతదేహాన్ని అప్పగించారు. తమ కుమారుడి మృతిపై తమకు ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN