Karimnagar: వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గం!

Karimnagar: వివాదాలను పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని కరీంనగర్ సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Sept 2026 7:21 PM IST
Karimnagar
X

Karimnagar: వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గం!

Karimnagar: వివాదాలను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు వెళ్లకుండా పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం సమర్థవంతమైన మార్గమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ భవనంలో పానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలోని తెలంగాణ మధ్యవర్తిత్వం మరియు ఆర్బిట్రేషన్ కేంద్రం నిర్వహిస్తున్న “దేశానికి మధ్యవర్తిత్వం 3.0 – మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0” కార్యక్రమం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మధ్యవర్తిత్వంపై మరింత అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలకు సత్వర పరిష్కారం, ఖర్చు తగ్గింపు, సంబంధాల పరిరక్షణ, న్యాయపరమైన వివాదాల తగ్గింపు వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.

ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకుని అంగీకారంతో పరిష్కారాన్ని పొందే అవకాశం ఉండటం మధ్యవర్తిత్వం ప్రత్యేకత అన్నారు. కుటుంబ, ఆస్తి, వాణిజ్య తదితర వివాదాల్లో చట్టపరమైన పరిధిలో మధ్యవర్తిత్వ సేవలను ప్రజలు వినియోగించుకోవచ్చని తెలిపారు. కరీంనగర్ జిల్లా ప్రజలు తమ వివాదాల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవా సంస్థ సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా పానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు కృషి చేయాలని యశ్వంత్ సింగ్ సూచించారు.

సమావేశానంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN