Karimnagar: కరీంనగర్‌లో 12వ వసంతాల తెలంగాణ సంబరాలు

Karimnagar: అమరులకు నివాళులర్పించి, పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Jun 2026 11:50 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో 12వ వసంతాల తెలంగాణ సంబరాలు

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు.

అనంతరం మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. మంత్రి మాట్లాడుతూ

ఎన్నో త్యాగాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా, ప్రజల ఆకాంక్షలే నేటి తెలంగాణ అభ్యుదయానికి పునాది అన్నారు.

2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమై నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, ప్రతి తెలంగాణ బిడ్డకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

తెలంగాణను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్-2047' దిశానిర్దేశక పత్రాన్ని ఆవిష్కరించింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఉపాధి అవకాశాలను విస్తరిస్తూ, సంపద సృష్టించి ఆ సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. తెలంగాణ నేడు దేశానికే కాదు, ప్రపంచానికి సైతం అభివృద్ధి నమూనాగా నిలుస్తుండటం మనందరికీ గర్వకారణం.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ, మన జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని మీ ముందుంచడం నా బాధ్యతగా భావిస్తున్నాను.

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక:

ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువత-క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైన పది అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం.

ప్రజల సమస్యలకు పరిష్కారం, ప్రభుత్వ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలపై వివరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు జిల్లా ప్రజలకు ఉద్యోగులు జర్నలిస్టులు అధికారులు పోలీసులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story