Sircilla: భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి మంత్రి పొంగులేటి
Sircilla: భూముల రీ-సర్వే, ఇందిరమ్మ ఇళ్లు, 2BHK పంపిణీపై కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష. మార్చి 2027 నాటికి రీ-సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.
Sircilla: భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి మంత్రి పొంగులేటి
సిరిసిల్ల: రాష్ట్రంలో భూముల రీ-సర్వేను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూముల రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 2BHK ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ, ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే చేపడుతున్నామని, మార్చి 2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కూడా మంత్రి ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో షెడ్యూల్ ప్రకారం భూముల రీ-సర్వే నిర్వహించి, అవసరమైన యంత్రాలు, సిబ్బంది అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ సభలు నిర్వహించి, నక్షా సర్వేను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.




