Husnabad: రాహుల్, ప్రియాంక అరెస్ట్ అప్రజాస్వామికం: మంత్రి పొన్నం!
Husnabad: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన. ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, ఓటరు జాబితా అవకతవకలపై సీఈసీ రాజీనామాకు డిమాండ్.
Husnabad: రాహుల్, ప్రియాంక అరెస్ట్ అప్రజాస్వామికం: మంత్రి పొన్నం!
Husnabad: ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితర ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడం ఆప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో బైఠాయించి ప్లాకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు సవరణ ప్రక్రియ పేరుతో ఎన్నికలను అపహాస్యం చేశారని ఆరోపిస్తూ సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నామని, అదే విధంగా ఈరోజు మరోసారి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న పరిస్థితుల్లో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాజ్యాంగ బద్ధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉందని, కానీ ఎన్నికల ప్రక్రియలో ఓట్ల తొలగింపు, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని, ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరిందని, అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నయన్నారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకోని తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు “ఓటు బచావో - దేశ్ బచావో” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నరన్నారు.
ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ అరెస్టులకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించబడిందని, ఆ ఓటు హక్కు ప్రతి భారతీయుడి ప్రజాస్వామ్య గుర్తింపు అన్నారు.
అలాంటి ఓటును ఎవరైనా అక్రమంగా తొలగిస్తే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే ఈ ఉద్యమం కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది కాదన్నారు.
ఇది ప్రతి ఓటరు హక్కుకు సంబంధించిన ఉద్యమం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఈ విషయం తెలియాలన్నారు. ఎన్నికల సంఘం బాధ్యత ఓట్లను తొలగించడం కాదని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును నమోదు చేసి, ఓటర్ల జాబితాను పారదర్శకంగా నిర్వహించడమన్నారు.
గతంలో కూడా ఓటర్ల జాబితాలో సవరణలు జరిగాయని, కానీ ఇప్పుడు లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.




