Hanumakonda: గ్రామ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మంత్రి ప్రభాకర్!
Hanumakonda: హనుమకొండ జిల్లా దండేపల్లిలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న' పంచాయతీ భవనం, రోడ్లు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
Hanumakonda: గ్రామ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మంత్రి ప్రభాకర్!
Hanumakonda: ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో దండేపల్లి గ్రామ ప్రగతి నివేదిక
ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దండేపల్లి గ్రామంలో సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని అధికారులు వివరించారు.
- 31 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అధిక శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి.
- 475 మందికి పెన్షన్లు అందుతుండగా, రూ.1.14 కోట్ల మేర నిధులు విడుదలవుతున్నాయి.
- గృహ జ్యోతి పథకం ద్వారా 693 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.59.83 లక్షల లబ్ధి చేకూరింది.
- మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 529 కుటుంబాలకు రూ.10.08 లక్షలు విడుదలయ్యాయి.
- 64 మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.29.88 లక్షలు, బ్యాంకు లింకేజీ కింద రూ.8.60 కోట్లు విడుదలయ్యాయి.
- ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి 900 కిట్ల చొప్పున 13 రకాల వస్తువులు అందించారు.
- 332 మంది రైతులకు రూ.2.88 కోట్లు రైతు రుణమాఫీ కింద లబ్ధి చేకూరింది.
- 1,033 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.5.28 కోట్లు అందాయి.
- రైతు బీమా కింద 7 మంది రైతుల కుటుంబాలకు రూ.35 లక్షల విలువైన చెక్కులు అందించారు.
- 428 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.81.07 లక్షలు విడుదలయ్యాయి.
- 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఒకరికి షాదీ ముబారక్ చెక్కులు అందించారు.
- 114 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
- గ్రామంలో 3,238 యూనిట్లకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది.
- భూభారతి కింద నమోదైన 9 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
దండేపల్లి అభివృద్ధికి పలు కీలక హామీలు
గ్రామ సర్పంచ్ గులిపల్లి సంపత్ గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్, అంగన్వాడీ భవనం వంటి అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, ఇప్పటివరకు రూ.58 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.
గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలం సిద్ధంగా ఉందని సర్పంచ్ కోరగా, అదే స్థలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆరు నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వివో భవన నిర్మాణానికి రెండు గుంటల స్థలాన్ని దానం చేసిన శంకర్ నారాయణను మంత్రి అభినందించారు. ఇప్పటికే ఒక వీఓ భవనం మంజూరు కాగా, దానం చేసిన స్థలంలో మరో రెండు వీజీఓ భవనాలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
దండేపల్లి గ్రామానికి సంబంధించిన రహదారి సమస్యలపై మంత్రి కీలక ప్రకటనలు చేశారు.
- వీరనారాయణపూర్–దండేపల్లి బ్రిడ్జి రోడ్డు మంజూరైంది.
- దండేపల్లి–సూరారం–ఎల్కతుర్తి రోడ్డు మంజూరు చేస్తామని ప్రకటించారు.
- దండేపల్లి–బావుపేట రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు.
- దండేపల్లి నుంచి దేశాయిపల్లి మీదుగా కమలాపూర్ వెళ్లే రహదారికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
- గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అంతర్గత సీసీ రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
- ఎల్లమ్మ ఆలయం, పోచమ్మ ఆలయం వైపు రోడ్ల అభివృద్ధితో పాటు అంబేద్కర్ వరకు మంజూరైన సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
- గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను కాంట్రాక్టర్‌తో మాట్లాడి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
- మంచినీటి బావి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- దశాబ్దాల తర్వాత దండేపల్లికి బస్సు సౌకర్యం వచ్చిందని, ఆదివారం కూడా బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించుకోవాలని కోరారు.
జలసిరి పథకం కింద ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్లాస్టిక్‌కు స్వస్తి - స్టీల్ బ్యాంక్‌కు ప్రోత్సాహం
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామాల్లో స్టీల్ బ్యాంకులను విస్తృతంగా వినియోగించాలని మంత్రి సూచించారు. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు.
దండేపల్లి గ్రామంలో మూడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో 900 స్టీల్ బ్యాంక్ కిట్లను, 13 రకాల వస్తువులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో హోటల్‌కు 100 స్టీల్ గ్లాసులు అందించినట్లు చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
ఈ నెల 31వ తేదీ వరకు పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్ఐవీ బాధితులు తదితర అర్హులైన వారు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పాఠశాలలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడా మైదానాలకు వెళ్లాలని సూచించారు. వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో పాల్గొనాలని చెప్పారు. క్రీడల్లో రాణిస్తే సర్టిఫికెట్ల ద్వారా ఆర్మీ, పోలీస్ తదితర ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు కృష్ణను నియమించామని, గ్రామంలో క్రీడా సామగ్రిని అందిస్తున్నామని చెప్పారు. హుస్నాబాద్ మినీ స్టేడియంలో ఇప్పటికే కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దండేపల్లి గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
14–15 సంవత్సరాల వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకాలు వేయించాలని మంత్రి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలి
పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని మంత్రి తెలిపారు. ఇంటి అవసరాలకు విద్యుత్‌ను వినియోగించుకుని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించుకునే అవకాశం ఉందని వివరించారు.
మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందిస్తూ, వారు ఆర్థికంగా ఎదిగేందుకు రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతున్నామని తెలిపారు.
ప్రజల సమస్యలను స్వయంగా విని, అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దండేపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గురవయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ గులిపల్లి సంపత్, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




