Vemulawada: వేములవాడ రాజన్న ఆలయాన్ని శతాబ్దం పాటు అభివృద్ధి చేస్తాం!

Vemulawada: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని శతాబ్దం పాటు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి, ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష.

KALEEM, SIRICILLA
Published on: 6 Oct 2026 8:56 AM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ రాజన్న ఆలయాన్ని శతాబ్దం పాటు అభివృద్ధి చేస్తాం!

Vemulawada: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని భవిష్యత్‌లో కనీసం 100 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించామని తెలిపారు.

మంజూరైన నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేస్తున్నామని చెప్పారు. వేములవాడకు ఇంకా అవసరమైన అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, అవసరమైన నిధులను సమకూర్చుకుని పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు, రోడ్డు లెవెల్స్, నిర్మాణ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని మంత్రి తెలిపారు. పనులను కేవలం ప్రారంభించడం కాకుండా నిర్దేశిత గడువులో, టార్గెట్ ఓరియెంటెడ్ విధానంలో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆలయ పాలక మండలి, అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధిని పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో వేములవాడను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

గతంలో హామీలు ఇచ్చి సంవత్సరాల తరబడి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉండేదని మంత్రి విమర్శించారు. కేవలం హామీలు ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడం అభివృద్ధి కాదని.. నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు.

వేములవాడ రాజన్న ఆలయాన్ని దక్షిణ కాశిగా మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడతో పాటు బాసర, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ ఆలయాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదని.. తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ప్రముఖ ఆలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు.

దేవాలయాల అభివృద్ధి విషయంలో మాటలకే పరిమితం కాకుండా నిధులు, పనులు, పర్యవేక్షణతో చేతల్లో చూపించే విధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిని పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక, పర్యాటక సౌకర్యాలు అందిస్తామని స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA