Karimnagar: మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ ఆదేశం

Karimnagar: తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరో 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 25 May 2026 8:13 AM IST
Karimnagar
X

Karimnagar: మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ ఆదేశం

కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అంశాలపై సమీక్ష చేపట్టారు.

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.45 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు దాదాపు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరిందని, వెంటనే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను మరో పది రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గన్ని బ్యాగుల కొరత లేదని, 21 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గోదాములు, లారీలు, హమాలీల కొరత ఉన్న ప్రాంతాల్లో వెంటనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రైతులకు మద్దతు ధర చెల్లింపులు వేగంగా అందేలా ట్యాబ్ ఎంట్రీలు, డేటా అప్‌డేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆదివారాల్లో కూడా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు

అనంతరం మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, చిత్రారామచంద్రన్, దివ్య దేవరాజన్ తదితరులు ఈ నెల 25 నుంచి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించే మహిళా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రోజువారీగా చేపట్టాల్సి ఉన్న కార్యక్రమాలను తెలియజేస్తూ, మహిళా సంక్షేమ వారోత్సవాలను నిర్దేశిత షెడ్యూల్ మేరకు నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి సీతక్క సూచించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story