Mancherial: ఆసుపత్రిలో వర్షపు బాధితురాలిని పరామర్శించిన మంత్రి!

Mancherial: భారీ వర్షానికి ఇల్లు కూలి గాయపడిన లక్ష్మిని మంత్రి వివేక్ పరామర్శించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 July 2026 12:04 PM IST
Mancherial
X

Mancherial: ఆసుపత్రిలో వర్షపు బాధితురాలిని పరామర్శించిన మంత్రి!

Mancherial: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మంచిర్యాల జిల్లాలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. కోటపల్లి మండలం ఆల్గాం గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో లక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమె ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల వివేక్ వెంకటస్వామి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో బాధిత కుటుంబానికి అత్యవసర సహాయంతో పాటు ప్రభుత్వం తరఫున వెంటనే ఇందిరమ్మ గృహాన్ని మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మందమర్రి, క్యాతనపల్లి, ఆస్నాద్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల రోడ్లు, కాలనీలు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులకు ఆదేశించారు. నష్టం వివరాల ఆధారంగా అవసరమైన పునరుద్ధరణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతామని తెలిపారు.

వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వెనుకాడదనీ స్పష్టం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story