Karimnagar: నిరుద్యోగులు, రైతులు గుడ్ న్యూస్.. ప్రభుత్వ 99 రోజుల ప్లాన్ ఇదే!
Karimnagar: రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా పాలన 99 రోజుల కార్యాచరణపై జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
Karimnagar: నిరుద్యోగులు, రైతులు గుడ్ న్యూస్.. ప్రభుత్వ 99 రోజుల ప్లాన్ ఇదే!
కరీంనగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పక్కడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలు, నీట్ పరీక్ష నిర్వహణ, ధాన్యం కొనుగోలు, ప్రజావాణి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే డి శ్రీనివాస్ రెడ్డి జిల్లా స్థాయిఅధికారులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తి పెంపు, ప్రభుత్వ పథకాల వినియోగాన్ని విస్తరించడం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని తెలిపారు. 4వ తేదీన జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నేల నమూనాల సేకరణ చేపట్టి, వాటిని పరీక్షించి రైతులకు వారి భూమికి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకునేందుకు మార్గదర్శకాలు అందించాలని, రైతు నమోదు చేపట్టాలని తెలిపారు. 5వ తేదీన ఉద్యాన పంటల ప్రోత్సాహం, నూనె గింజల పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచే చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని, విభిన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయం పెంపుపై దృష్టి సాధించేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.
6వ తేదీన రైతులకు తక్షణ, దీర్ఘకాలిక పంట రుణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మౌలిక సదుపాయాలు, కనీస మద్దతు ధర విధానం, మార్కెట్ కమిటీ వినియోగంపై రైతులకు వివరించాలని, 7వ తేదీన ఆధునిక వ్యవసాయ పద్ధతులలో భాగంగా వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలు, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కుసుమ్ పథకంపై రైతులకు వివరించి, సౌర శక్తి వినియోగంపై అవగాహన పెంపొందించాలని తెలిపారు. 8వ తేదీన పశుసంవర్థక, మత్స్యశాఖల ఆధ్వర్యంలో పశువుల జాతి మెరుగుదల, చేపల ఉత్పత్తి పెంపు, వేసవి కాలంలో పశువుల సంరక్షణపై రైతులకు అవసరమైన సూచనలు అందించాలని, 9వ తేదీన నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాలువల శుభ్రపరిచే కార్యక్రమాలు, పొదల తొలగింపు, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించే విధానాలపై చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
రాబోయే సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి అంచనా సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండగా ప్రభుత్వం 90 లక్ష మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 వేల 575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరుగగా, ఇప్పటి వరకు కనీస మద్దతు ధర కింద రైతులకు 581 కోట్ల 72 లక్షల రూపాయల చెల్లింపులు జరిగాయని తెలిపారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని సాధించేందుకు ట్యాబ్ ఎంట్రీలు, రవాణా, కార్మికుల అందుబాటు, గోనె సంచుల సరఫరా, హార్వెస్టర్ యంత్రాల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని, వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలలోని రైస్ మిల్లుల సామర్థ్యం, మొక్కజొన్న కొనుగోళ్ల పరిస్థితులపై సమీక్షించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఉపాధి హామీ పథకం కింద కూలీల సమీకరణను మరింత బలోపేతం చేయాలని, పనితీరు తక్కువగా ఉన్న మండలాలు, గ్రామ పంచాయతీలను ప్రత్యక్షంగా సందర్శించి పర్యవేక్షణ చేపట్టి, లక్ష్య సాధన దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నమోదు చేసిన అన్ని క్రియాశీల కూలీలకు ఉపాధి కల్పించడం, ప్రతి నివాస ప్రాంతంలో పనులు ప్రారంభించడం, వేసవి దృష్ట్యా ప్రతి పని ప్రదేశంలో నీడ, తాగునీరు, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పనుల జాబితాలో కనీసం 20 కూలీ ఆధారిత పనులు ఉండేలా చూడాలని, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించి పర్యవేక్షణను బలోపేతం చేయాలని తెలిపారు. కూలీల హాజరు, పనితీరు మెరుగుపర్చడానికి ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి, పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. గ్రామపంచాయతీ స్థాయిలో సర్పంచ్ సమక్షంలో క్రియాశీల కూలీలతో సమావేశాలు నిర్వహించి, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చర్యల ద్వారా ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలై, గ్రామీణ కూలీలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నోడల్ అధికారిగా రాజస్వ మండల అధికారిని నియమించి ప్రజావాణి కార్యక్రమ నిర్వహణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరించిన 30 రోజులలోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో తిరస్కరణ, అందుకు గల కారణాలతో దరఖాసుదారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల సంబంధిత వివరాలను పోర్టల్ లో నమోదు చేసి రసీదు అందించాలని, దరఖాస్తుదారులు ప్రజావాణి పోర్టల్ లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి వచ్చే ప్రజలకు త్రాగునీరు, కుర్చీలు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నీట్ పరీక్ష నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా తీసుకోవడం జరుగుతుందని, పరీక్ష కేంద్రంలోనికి ఎలాంటి డిజిటల్ పరికరాలు అనుమతించడం జరగదని, పరీక్ష రాసే అభ్యర్థుల తనిఖీ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ప్రశ్నపత్రాల రవాణాపై పోలీస్, రెవెన్యూ, తపాలా శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాలలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష ముగిసిన తరువాత ఓ.ఎం.ఆర్. పత్రాల తరలింపు నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. పరీక్షా సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి, ఓ.ఆర్.ఎస్., అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగ అభ్యర్థుల కొరకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
జనగణన అధికారి భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జనగణన -2027లో భాగంగా మొదటి విడతలో మే 11వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు ఇండ్ల గడన చేపట్టడం జరుగుతుందని, ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ అందించడం జరుగుతుందని, ఇందుకుగాను అవసరమైన సామాగ్రి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, 95 శాతం కేటాయించిన ప్రకారంగా అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, యువత స్వీయ గణన చేసుకునేలా అవగాహన కల్పించాలని, టామ్ టామ్, దినపత్రికలు, ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. 33 ప్రశ్నలకు సరైన సమాధానం అందించాలని, స్వీయ గణన ప్రక్రియ అనంతరం వచ్చిన సంఖ్యను భద్రపరచుకుని గణన అధికారులు ఇంటికి వచ్చిన సమయంలో అందించేలా ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే డి శ్రీనివాస్ రెడ్డి ఆర్డీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు సిపిఓ రామ్ దత్తారెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు జిల్లా మేనేజర్ రజనీకాంత్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి డిఆర్ డి ఓ శ్రీధర్ డిపిఓ జగదీశ్వర్ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




