Karimnagar: రేవంత్ రెడ్డి బండి సంజయ్‌ల చీకటి దోస్తీ

Karimnagar: కరీంనగర్‌లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రెస్ మీట్.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 4 Jun 2026 2:53 PM IST
Karimnagar
X

Karimnagar: రేవంత్ రెడ్డి బండి సంజయ్‌ల చీకటి దోస్తీ

కరీంనగర్‌: కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విషయంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

2019లోనే మంజూరైన జాతీయ రహదారికి మళ్లీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిందంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. 2024లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత సెప్టెంబర్‌లోనే టెండర్లు పూర్తవుతాయని, పనులు ప్రారంభమవుతాయని బండి సంజయ్ ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం 2025 సెప్టెంబర్‌లో రహదారి పనులు ప్రారంభమవుతాయని ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

కరీంనగర్ ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని ప్రశ్నించిన ఆయన, 2019లో బండి సంజయ్ ఎంపీ కాకముందే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఈ జాతీయ రహదారిని మంజూరు చేయించారని తెలిపారు. ఏడేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పటివరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయించలేకపోయారని ఎద్దేవా చేశారు.

ప్రతి ఏడాది ఈ రహదారిపై పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని, వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజల ప్రాణాలపై కేంద్ర ప్రభుత్వానికి, స్థానిక ఎంపీకి పట్టింపు లేకపోవడం బాధాకరమన్నారు.

2020లోనే ప్రారంభమై పూర్తి కావాల్సిన ఎన్‌హెచ్-563 పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, ఇప్పుడు మళ్లీ మంత్రివర్గ ఆమోదమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 60 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని, మిగిలిన 40 శాతం భూసేకరణ చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా తీగలగుట్టపల్లి వద్ద నిర్మిస్తున్న ఆర్‌ఓబీ కూడా పూర్తి కాలేదని విమర్శించారు.

కొండగట్టు అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేకపోయారని, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. భూసేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బండి సంజయ్‌కు ఉన్న చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జాతీయ రహదారి పనులు ప్రారంభించాలని, ప్రతి నెలా కొత్త ప్రకటనలతో కాలయాపన చేయొద్దని హెచ్చరించారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story