Boyinpalli: బోయినీపల్లిలో వీఓఏ జేఏసీ నిరసన

Boyinpalli: బోయినీపల్లి నిరసనలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శ.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 30 May 2026 4:05 PM IST
Boyinpalli
X

Boyinpalli: బోయినీపల్లిలో వీఓఏ జేఏసీ నిరసన

బోయినపల్లి: తెలంగాణ రాష్ట్ర వీఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఓఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినీపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క వీఓఏలకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, SERP ఉద్యోగులుగా గుర్తిస్తామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క అసెంబ్లీలో వీఓఏల సమస్యలను ప్రస్తావించి, జీవో 58లో సవరణలు చేయడంతో పాటు నెలకు రూ.26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వీఓఏల వేతనాలను పెంచారని, ప్రస్తుతం అందుతున్న రూ.5,000 గౌరవ వేతనానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. అయినప్పటికీ వీఓఏల ప్రధాన డిమాండ్ శాశ్వత ఉద్యోగ భద్రతతో పాటు గౌరవప్రదమైన వేతనాలేనని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీఓఏలు, మహిళా సంఘాల కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికైనా వీఓఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి వీఓఏల పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తుందని సుంకే రవిశంకర్ హెచ్చరించారు.

వీఓఏల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి వెన్నంటి నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీఓఏలు పాల్గొన్నారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story