Sircilla: సమస్యలు తీరే వరకు సమ్మె విరమించం: సిరిసిల్ల కార్మికులు

Sircilla: రాజన్న సిరిసిల్లలో సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. కమిషనర్‌తో చర్చలు విఫలం కావడంతో ధర్నా కొనసాగుతోంది.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 5:50 PM IST
Sircilla
X

Sircilla: సమస్యలు తీరే వరకు సమ్మె విరమించం: సిరిసిల్ల కార్మికులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి విధులను బహిష్కరించిన కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

సమ్మె నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ సీఐటీయూ మున్సిపల్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, సమ్మెను విరమించాలని కోరారు. అయితే చర్చల్లో స్పష్టత రాకపోవడంతో కార్మిక నాయకులు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించనున్నట్లు ప్రకటించారు.

కార్మికులు ప్రధానంగా ఏడు అంశాలపై డిమాండ్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన, 60 ఏళ్లు పైబడి పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు తాత్కాలికంగానైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అదనపు కార్మికులను నియమించి ప్రస్తుత సిబ్బందిపై పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

2009 నుంచి 2012 వరకు 118 మంది కార్మికులకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించి, వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేయాలని కోరుతున్నారు. మరో రెండు బ్యాచ్‌లకు చెందిన 58 మంది కార్మికులతో పాటు విలీన గ్రామాల కార్మికులకు రావాల్సిన పీఎఫ్ బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

సిరిసిల్ల పట్టణంలో పనిచేస్తున్న కార్మికులందరికీ గతంలో మాదిరిగానే మున్సిపల్ కార్యాలయంలోనే హాజరు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన దుస్తులు, చెప్పులు, సబ్బులు, నూనెలు, గ్లౌజులు, ఇతర రక్షణ సామగ్రిని వెంటనే అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే కార్మికులందరికీ ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు అందించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, సాధారణ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెల ఐదో తేదీలోపు వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

ఈ సమ్మె, ధర్నా కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షులు మూశం రమేష్, యూనియన్ అధ్యక్షుడు కాసారపు శంకర్, బాబా కిషన్, అర్జున్, ఉమ, లక్ష్మీ, విజయ, దేవరాజు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA