Mustabad: ముస్తాబాద్‌లో మహా జలాభిషేకం వర్షాల కోసం కప్పతల్లి ఆటలు!
Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ శివాలయంలో వర్షాలు కురవాలని మహా జలాభిషేకం. కప్పతల్లి ఆటలతో వరుణదేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన గ్రామస్తులు.
Mustabad: ముస్తాబాద్‌లో మహా జలాభిషేకం వర్షాల కోసం కప్పతల్లి ఆటలు!
Mustabad: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణంలోని శ్రీ శివ కేశవ ఆలయంలో మహా జలాభిషేకం, ప్రత్యేక పూజలు, సంప్రదాయ కప్పతల్లి ఆటలతో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్తులు ప్రార్థనలు చేశారు.
ఆలయ కమిటీ చైర్మన్ మిరుదొడ్డి సారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పెద్ద చెరువు నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి శివలింగం పూర్తిగా నీటిలో మునిగే వరకు మహా జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని ప్రార్థించారు.
అనంతరం గ్రామస్తులు సంప్రదాయ కప్పతల్లి ఆటలు ఆడి వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటల సాగు దెబ్బతింటోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
రైతుల కష్టాలు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




