Karimnagar: కరీంనగర్‌లో నీట్-2026 ప్రశాంతం.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్!

Karimnagar: కరీంనగర్‌లో నీట్ (NEET-UG) 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 22 Jun 2026 8:25 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో నీట్-2026 ప్రశాంతం.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్!

కరీంనగర్ : జిల్లాలో నిర్వహించిన నీట్ (NEET-UG)–2026 పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.

పరీక్ష నిర్వహణను కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సంయుక్తంగా పర్యవేక్షించారు. జిల్లాలోని కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కేంద్రీయ విద్యాలయంలో పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ప్రవేశం, ద్విస్థాయి భద్రతా తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, బయోమెట్రిక్ ధృవీకరణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు.

పరీక్ష సజావుగా జరిగేలా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయగా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల నీట్ పరీక్ష విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. పరీక్ష సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. పరీక్ష ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, పరీక్ష పారదర్శక నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

జిల్లాలోని మొత్తం ఏడు పరీక్షా కేంద్రాల్లో 3,001 మంది అభ్యర్థులకు గాను 2,661 మంది హాజరుకాగా, 340 మంది గైర్హాజరయ్యారు.

కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల – 744 మందికి గాను 662 మంది హాజరు, 82 మంది గైర్హాజరు

ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల – 720 మందికి గాను 651 మంది హాజరు, 69 మంది గైర్హాజరు

అలుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – 408 మందికి గాను 359 మంది హాజరు, 49 మంది గైర్హాజరు

కేంద్రీయ విద్యాలయం – 361 మందికి గాను 316 మంది హాజరు, 45 మంది గైర్హాజరు

ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల – 312 మందికి గాను 278 మంది హాజరు, 34 మంది గైర్హాజరు

మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర కళాశాల – 288 మందికి గాను 251 మంది హాజరు, 37 మంది గైర్హాజరు

టీజీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల జూనియర్ కళాశాల, చింతకుంట – 168 మందికి గాను 144 మంది హాజరు, 24 మంది గైర్హాజరు

పరీక్ష నిర్వహణలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story