Sirikonda: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలేవి? సుజాత ఆగ్రహం!

Sirikonda: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరికొండలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సుజాత సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఆరోపించారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 7:04 PM IST
Sirikonda
X

Sirikonda: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలేవి? సుజాత ఆగ్రహం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరికొండ గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామానికి చెందిన సుజాత ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సర్వే నంబర్ 127లో అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే ఐదుగురు వ్యక్తులు అక్రమంగా పట్టాలు పొందారని తెలిపారు. ఈ వ్యవహారంపై జూన్ 1 నుంచి ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే సర్వే నంబర్ 120లోని ప్రభుత్వ భూమిని ఉపాధి హామీ పథకం కింద వినియోగించి రూ.46 వేలకు పైగా బిల్లులు పొందినట్లు ఆరోపించారు. ఈ భూమిలో సుమారు రెండు వేల మొక్కలు నాటినట్లు, ఇందుకు సంబంధించిన మస్టర్లు, బిల్లుల వివరాలను ఏపీవో అధికారులు రాతపూర్వకంగా ధృవీకరించినట్లు వెల్లడించారు.

రెవెన్యూ అధికారులు విచారణ అనంతరం ప్రొసీడింగ్స్ జారీ చేసినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా భూమిని స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఆన్‌లైన్ సమస్యల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేసి, ఉపాధి హామీ నిధుల వినియోగంపై విచారణ జరిపి నిధులు రికవరీ చేయాలని ఉన్నతాధికారులను సుజాత కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA