Karimnagar: కరీంనగర్‌లో పెట్రోల్ డీజిల్ కొరత లేదు: అడిషనల్ కలెక్టర్
Karimnagar: కరీంనగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచించారు.
Karimnagar
Karimnagar: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పెట్రోల్ బంకుల యజమానులు, గ్యాస్ డీలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
సమావేశంలో గ్యాస్, పెట్రోల్ సరఫరాలపై సమగ్రంగా చర్చించి నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. వరి కోతల సమయంలో హార్వెస్టర్లు, ధాన్యం తరలించే లారీలు, ట్రాక్టర్లకు ఎలాంటి డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. పెట్రోల్ బంకులు డ్రై కాకుండా సరిపడా నిల్వలు ఉంచుకోవాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పౌరసరఫరాల అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
రామగుండం ఆయిల్ డిపోలో సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, ఇండియన్ ఆయిల్ సేల్స్ ఆఫీసర్ షఫిక్, గ్యాస్, పెట్రోల్ బంకుల డీలర్లు, యజమానులు పాల్గొన్నారు.




