Karimnagar: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనం మహిళపై కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం!

Karimnagar: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయి మహిళను బావిలో తోసేసి నగలు దోచుకున్న డిగ్రీ విద్యార్థి దినేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 4 July 2026 7:37 PM IST
Karimnagar
X

Karimnagar: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనం మహిళపై కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం!

కరీంనగర్: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో భారీగా డబ్బులు నష్టపోయి, అప్పుల ఒత్తిడితో మహిళను కిడ్నాప్ చేసి, బంగారు ఆభరణాలు దోచుకుని హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

తేదీ. 01-07-2026 నాడు ఉదయం 1000 గంటలకు కరీంనగర్ టవర్ సర్కిల్ సమీపంలోని లేబర్ అడ్డా వద్ద కూలీ పనికి వేచి ఉన్న గంగాధర లక్ష్మి (55) అనే మహిళ అదృశ్యమైన ఘటనపై తొలుత కరీంనగర్-3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో మహిళను కిడ్నాప్ చేసి దోపిడీ చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు తేలడంతో కేసును కరీంనగర్-1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో గొల్లపల్లి గ్రామానికి చెందిన ధమ్మ దినేష్ రెడ్డి (21), డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడు DIUWIN, జియో లాటరీ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ గేమ్స్‌కు బానిసై సుమారు రూ.4 లక్షలు నష్టపోయాడు. అదనంగా పలు లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుని వసూళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పథకం రచించాడు.

నేరానికి వారం రోజుల ముందే నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన నిందితుడు, 01-07-2026 న టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద ఒంటరిగా ఉన్న బాధితురాలిని లక్ష్యంగా ఎంచుకున్నాడు. ర్యాపిడో బైక్‌ను బుక్ చేసి బాధితురాలిని తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లి, అనంతరం నుస్తులాపూర్ గ్రామ శివారులో పొలాల వైపు తీసుకెళ్లాడు. అక్కడ బాధితురాలిపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న బంగారు పుస్తెలు రెండు, ఐదు బంగారు గుండ్లు, ఒక బంగారు చెవిపోగు (అన్నీ కలిపి ఐదు గ్రాములు), 20 గ్రాముల వెండి మట్టెలను దోచుకున్నాడు.

అనంతరం తన నేరాన్ని దాచిపెట్టే ఉద్దేశంతో బాధితురాలిని వ్యవసాయ బావిలోకి తోసివేశాడు. బాధితురాలు బావిలో ఉన్న తాడును పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకకూడదనే ఉద్దేశంతో, బ్రతికితే తనను గుర్తించే అవకాశం ఉందని భావించి, ఆమె పట్టుకున్న తాడును కూడా కత్తిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే బాధితురాలికి ఈత రావడంతో బావిలో ఉన్న మోటార్ పైపులకు కట్టిన మరో తాడును పట్టుకుని రాత్రంతా బావిలోనే ప్రాణభయంతో గడిపింది. మరుసటి రోజు ఉదయం పొలం వద్దకు వచ్చిన రైతులు ఆమె కేకలు విని తాళ్లు, మంచం సహాయంతో బయటకు తీసి రక్షించారు. అనంతరం ఆమెను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు.

కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, సెల్‌ఫోన్ విశ్లేషణ, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా నిందితుడిని మార్కెట్ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడి వద్ద నుంచి నిందితుడి మొబైల్ ఫోన్, బాధితురాలి మొబైల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను, రూ.5,000 నగదు, బాధితురాలి 20 గ్రాముల వెండి మెట్టెలను పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు. దోచుకున్న బంగారు ఆభరణాలను కరీంనగర్ టవర్ సర్కిల్‌లోని ఓ నగల వ్యాపారి అయిన వెేణుమనోహర చారికి కి విక్రయించి రూ.30,000 పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఆ బంగారు నగల వ్యాపారి అయిన వేణు మనోహర చారి వద్ద నుంచి బంగారు పుస్తెలు, ఐదు బంగారు గుండ్లు, 20 గ్రాముల వెండి మట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన ఆస్తి స్వాధీనం, శాస్త్రీయ ఆధారాల సేకరణ, ఇతర సాక్ష్యాల సమీకరణ పూర్తి చేసి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి...

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, అక్రమ బెట్టింగ్ యాప్‌లు వ్యక్తులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి చివరకు తీవ్రమైన నేరాలకు దారి తీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి యాప్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. అలాగే కూలీ పనుల కోసం లేబర్ అడ్డాల వద్ద వేచి ఉండే అమాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల ఇదే తరహాలో కూలీ పనికి తీసుకెళ్తామని చెప్పి ఒక వ్యక్తిని గదిలో నిర్బంధించి దాడి చేసి నగదు దోచుకున్న కేసును కూడా కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు ఛేదించిన విషయాన్ని గుర్తు చేశారు.

కూలీలు అపరిచిత వ్యక్తులను నమ్మి ఒంటరిగా వెళ్లవద్దని, పనికి తీసుకెళ్లే వ్యక్తుల వివరాలు, వాహనం నంబర్, గమ్యస్థానం వంటి సమాచారాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు లేదా తోటి కూలీలకు తెలియజేసి వెళ్లాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా, సాంకేతిక ఆధారాలతో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్ కె. రామచందర్ రావు, ఇన్స్పెక్టర్ తిరుమల్, ఎస్సైలు సుమన్, చేరాలు, భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, పోలీస్ కానిస్టేబుళ్లు లక్ష్మిపతి, రాజ్‌కుమార్, ప్రశాంత్లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story