Peddapalli: భూభారతి పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి!
Peddapalli: భూభారతి పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Peddapalli: భూభారతి పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి!
పెద్దపల్లి: భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో భూభారతి దరఖాస్తులు, హైకోర్టు కేసులు, భూముల రీ-సర్వే, జీఓ 58, జీఓ 76 కింద పెండింగ్ అంశాల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను కేటాయించాలని, నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సర్వే పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జీఓ 58, జీఓ 76 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఇతర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. రెగ్యులరైజేషన్‌తో పాటు రెవెన్యూకు సంబంధించిన ప్రతి అంశం ఆన్లైన్లో తప్పనిసరిగా ప్రతిబింబించాలని, ఆన్లైన్లో నమోదైన వివరాల ఆధారంగానే నివేదికలు సమర్పించాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లాలో సింగరేణి, జెన్కో భూములకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరితగతిన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు క్యాబినెట్ ముందుకు వెళ్లే అవకాశం ఉన్నందున, అవసరమైన నివేదికలు అందిన వెంటనే ఇంధన శాఖ నుంచి క్లియరెన్స్ పొందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు మాట్లాడుతూ, జిల్లాలో భూభారతికి సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తున్నామని, ప్రస్తుతం కేవలం 11 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. జీఓ 76 కింద మొత్తం 1,893 దరఖాస్తులకు గాను 1,581 దరఖాస్తులు క్లియర్ అయ్యాయని తెలిపారు.
జీఓ 58 కింద మొత్తం 682 దరఖాస్తులకు గాను 348 దరఖాస్తులపై ఇప్పటికే విచారణ పూర్తి చేసి క్లోజ్ చేసినప్పటికీ, పోర్టల్‌లో పెండింగ్‌గా కనిపిస్తున్నాయని తెలిపారు. మిగిలిన 334 దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించి, సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ పరిపాలనాధికారి బి. ప్రకాష్, డి.ఈ. సెక్షన్ పర్యవేక్షకులు ధీరజ్, విజయ్, కలెక్టరేట్ రెవెన్యూ విభాగం అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.




