Peddapalli: వందేళ్ల చరిత్ర కలిగిన కమాన్ తొలగింపుపై బీజేపీ నిరసన

Peddapalli: పెద్దపల్లిలో వందేళ్ల చరిత్ర కలిగిన చారిత్రక కమాన్‌ను రాత్రికి రాత్రే తొలగించడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

RAJU, PEDDAPALLI
Published on: 15 Nov 2026 7:20 PM IST
Peddapalli
X

Peddapalli: వందేళ్ల చరిత్ర కలిగిన కమాన్ తొలగింపుపై బీజేపీ నిరసన

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణానికి చారిత్రక గుర్తింపుగా నిలిచిన సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన కమాన్‌ను ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే తొలగించడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కమాన్ తొలగింపును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలతో కలిసి కమాన్ చౌరస్తా వద్ద ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి స్వాగత తోరణంగా గుర్తింపు పొందిన ఈ కమాన్‌ను తొలగించడాన్ని ఖండించారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ చరిత్రకు ప్రతీకగా నిలిచిన కట్టడాన్ని తొలగించడం ద్వారా చారిత్రక గుర్తింపును కనుమరుగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన స్థలంలో కాకతీయుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అద్భుతమైన నూతన కమాన్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ చారిత్రక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

పెద్దపల్లి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పారిశుద్ధ్య సమస్యలతో అనారోగ్య పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లి అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తగిన దృష్టి సారించడం లేదని విమర్శించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాల ఏర్పాటుపై చూపుతున్న శ్రద్ధను బైపాస్ రోడ్డు, కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై కూడా చూపించాలని హితవు పలికారు. ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.

పోలీస్ అధికారులు పాలకుల కోసం పనిచేస్తున్నారా? ప్రజల కోసం పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా అధికారులు తమ విధులను, బాధ్యతలను మరచిపోకూడదని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కావేటి రాజగోపాల్, రాజం మహంత కృష్ణ, పిట్ట వినయ్, గద్దల రాజు, అమరబండ సతీష్, కొలీపాక శేఖర్, అమరగొండ ప్రదీప్, బిరుదు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI