Peddapalli: పెద్దపల్లి మార్కెట్ యార్డులో బీజేపీ 'రైతు గోస'
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Peddapalli: పెద్దపల్లి మార్కెట్ యార్డులో బీజేపీ 'రైతు గోస'
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో రైతుల సమస్యలపై బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “రైతు గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మార్కెట్ యార్డులో రైతులతో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పంట కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఏప్రిల్ మొదటి వారంలో కోతలు ప్రారంభమైనా ఇప్పటికీ కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా నుంచి ప్రారంభమైన “రైతు గోస – బీజేపీ భరోసా” కార్యక్రమం పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. గుంజపడుగు, పెద్దపల్లిలో రైతులతో సమావేశమైన బీజేపీ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రోడ్లపై ఎక్కడ చూసినా వరికుప్పలు, మొక్కజొన్న కుప్పలు కనిపిస్తున్నాయని గింజ గింజకు వెంటనే కాంటా పెట్టి ఉంటే రైతులు ఇంత కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఏప్రిల్‌లో కోతలు మొదలైనా 25 నుంచి 30 రోజుల వరకు కొనుగోళ్లు జరగకపోవడంతో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం పేరుకుపోయిందని తెలిపారు.
40 రోజులు గడిచినా సంచులు, హమాలీలు, కాంటాలు, ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులో లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని… ఇసుక రవాణాకు వేల లారీలు తిరుగుతున్నా రైతుల ధాన్యానికి మాత్రం లారీలు లేకపోవడం బాధాకరమన్నారు. ధాన్యం కుప్పల వద్దే రైతు కుటుంబాలు కాపలా కాస్తూ పడుకుంటున్నారని… ఎండ తీవ్రతతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పారు.
గత ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీరులో వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని… క్వింటాకు 10 కిలోల వరకు తరుగులు తీస్తున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.




