Peddapalli: భూధార్ కార్డుల జారీకి రీ-సర్వే అత్యంత కీలకం.. కలెక్టర్
Peddapalli: పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామంలో జరిగిన భూభారతి – రీ-సర్వే అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
Peddapalli: భూధార్ కార్డుల జారీకి రీ-సర్వే అత్యంత కీలకం.. కలెక్టర్
Peddapalli: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభ లో భూభారతి – రీ-సర్వే అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, ఇతర భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీ-సర్వే నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 190 రెవెన్యూ గ్రామాలు ఉండగా, మొదటి దశలో 70 గ్రామాలను రీ-సర్వే కోసం ఎంపిక చేసినట్లు, అందులో సబ్బితం గ్రామం కూడా ఒకటని పేర్కొన్నారు.
రీ-సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, అనంతరం ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామని తెలిపారు. సర్వే ప్రక్రియను ఆధునిక యంత్రాల సహాయంతో పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడించారు.
సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.
పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వే ద్వారా 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. గ్రామాల్లో రీ-సర్వే జరుగుతున్న సమయంలో ప్రజలు అందుబాటులో ఉంటూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
రోజుకు సుమారు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తామని, ఏ భూములను సర్వే చేయనున్నారనే సమాచారాన్ని ముందుగానే అందిస్తామని, సంబంధిత రైతులు నిర్దేశిత సమయంలో తమ భూముల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. రీ-సర్వే ద్వారా రూపొందించే భూ వివరాలు రాబోయే 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
ఆధార్ తరహాలో భూధార్ కార్డుల జారీకి ఈ రీ-సర్వే కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజయ్య, సర్పంచ్ నూనె సరోజన, సర్వేయర్ లు,రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




