Manthani: మండల సర్వసభ్య సమావేశంలో సమీక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI
Published on: 7 Aug 2026 11:03 PM IST
Manthani
X

Manthani: మండల సర్వసభ్య సమావేశంలో సమీక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాల పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్. మండలంలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

వ్యవసాయం, వైద్యం, విద్య, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, విద్యుత్, ఉద్యానవనం, రవాణా, నీటిపారుదల, ఆర్ అండ్ బీ తదితర శాఖల అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వీబీజీ–రామ్‌జీ పథకం కింద చేపడుతున్న జలసిరి కార్యక్రమం, ఇంకుడు గుంతలు, పంటకుంటలు, ఇతర సహజ వనరుల అభివృద్ధి పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో* ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందించాలని తెలిపారు. యూరియా పంపిణీ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించడంతో పాటు సేంద్రియ సాగు విధానాలపై రైతులను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.

*మిషన్ భగీరథ* పరిధిలో నీటి సరఫరా వ్యవస్థలో ఉన్న సమస్యలను గ్రామాల వారీగా గుర్తించి, శాశ్వత పరిష్కారాల కోసం సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా ఎక్కడా నిలిచిపోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలపై* ప్రత్యేక దృష్టి సారించాలని, ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్యాధికారికి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.

*విద్యుత్ శాఖ* అధికారులు గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు తగ్గించేలా నిర్వహణ పనులు చేపట్టాలని, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను ఆలస్యం చేయకుండా మరమ్మతు చేయడం లేదా అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను శాఖల అధికారులు కేవలం నమోదు చేయడానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో అధికారులు తరచూ పర్యటించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలపై మరింత విశ్వాసం కల్పించవచ్చని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి పూర్ణచందర్ EE గ్రిడ్, AMC చైర్మన్ - కుడుదుల వెంకన్న, పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి కొత్త శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సలహా మండలి సభ్యుడు - శశిభూషణ్ కాశే, RTA సభ్యుడు - మంథని సురేష్ , ఎంపీడీవో శ్రీజ రెడ్డి, తహసీల్దార్ ఆరిఫుద్దీన్, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story