Sultanabad: ఆకలితో ఉన్న మహిళను ఆదుకున్న యువ సంకల్ప ఫౌండేషన్!

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆకలితో అలమటిస్తున్న మానసిక దివ్యాంగురాలికి యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు.

KONDAL, SULTANABAD
Published on: 19 Nov 2026 1:58 PM IST
Sultanabad
X

Sultanabad: ఆకలితో ఉన్న మహిళను ఆదుకున్న యువ సంకల్ప ఫౌండేషన్!

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కాల్వ శ్రీరాంపూర్ వెళ్లే రోడ్డు దుకాణ సముదాయాల ముందు ఆదివారం రాత్రి ఒంటరిగా కూర్చున్న ఓ మహిళను యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ గమనించారు. ఆమె వద్దకు వెళ్లి విచారించగా, గత రెండు రోజులుగా అన్నం తినలేదని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న టిఫిన్ సెంటరు నుండి ఆహారం తెప్పించి ఇచ్చారు. అనంతరం ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సుల్తానాబాద్‌లోని వృద్ధాశ్రమానికి సమాచారం అందించారు. ఫౌండేషన్ సభ్యుడు దేశెట్టి రమేష్ సహకారంతో అదే రోజు రాత్రి ఆమెను వృద్ధాశ్రమంలో సురక్షితంగా చేర్పించారు.

​రెండు రోజులుగా ఆ మహిళ ప్రవర్తనను పరిశీలించిన ఆశ్రమ నిర్వాహకులు, తలనీలాలు తీసివేస్తే పాత జ్ఞాపకాలు వచ్చే అవకాశముందని సూచించగా... వెంటనే నాయి బ్రాహ్మణుడిని పిలిపించి తలనీలాలు తీసివేయించారు. అనంతరం కొత్త దుస్తులు అందించి ఆమెతో ప్రేమగా మాట్లాడారు. ఈ క్రమంలో కోలుకున్న ఆ మహిళ తన పేరు లక్ష్మి అని, సొంత ఊరు సికింద్రాబాద్ కాగా అత్తగారి ఊరు కనుకుల అని తెలిపింది. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, భర్త విడిచిపెట్టడంతో ఒక కాలు లేకపోయినా ఒంటికాలితోనే కాలం వెళ్లదీస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

​ఈ సందర్భంగా తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ— చిన్నప్పటి నుండి ఎదుటివారికి సహాయం చేయాలని కన్న తల్లిదండ్రులు నేర్పిన బాటలోనే నడుస్తున్నానని తెలిపారు. "నేను తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ, ఇలాంటి అనాథ వృద్ధులలోనే నా తల్లిదండ్రులను చూసుకుంటున్నాను. సుల్తానాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో తోటివారికి సాయపడాలి" అని పిలుపునిచ్చారు.

​దివ్యాంగురాలికి పునర్జన్మ ప్రసాదించిన తుమ్మ రాజ్ కుమార్, యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులను స్థానిక ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నారేడు గట్టు స్వామి, నరేష్, వృద్ధాశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD