Sircilla: యాసంగిలో వరి సాగు నియంత్రణ.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
Sircilla: యాసంగిలో వరి సాగు నియంత్రించి ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలను ప్రోత్సహించాలని సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్లో సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్కు సూచించారు.
Sircilla: యాసంగిలో వరి సాగు నియంత్రణ.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి పంటల సాగు ప్రణాళికను నీటి లభ్యతకు అనుగుణంగా రూపొందించాలని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో వరి సాగును నియంత్రించి, ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్య, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వీబీజీ రామ్ జీ పథకం పనుల పురోగతిపై శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
యాసంగి సీజన్లో నీటి లభ్యతను బట్టి పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని, పంటల వైవిధ్యీకరణపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. రైతు ఐడీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటు, సూక్ష్మ సేద్య విధానాల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచి, కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు కనీసం 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరును పర్యవేక్షించాలని, ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ అభ్యసన వేదికలను వినియోగించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని ఆదేశించారు.
రూసా 2.0, పీఎం ఉషా పథకాల కింద మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల పనులను వేగవంతం చేయడంతో పాటు, మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాగునీటి ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు. వీబీజీ రామ్ జీ పథకం కింద నీటి సంరక్షణ నిర్మాణాలు, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా అధికారులతో సమీక్షిస్తూ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులను ఆదేశించారు. నాబార్డ్ నిధులతో చేపట్టిన విద్యాలయాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని, పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పరిశీలించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు.
వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించి జిల్లాలో వరి సాగును నియంత్రించాలని, ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. అగ్రహారంలో డిగ్రీ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి విజయ్ సాగర్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామకృష్ణ, నీటిపారుదల శాఖ అధికారి యుగంధర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా నాయక్, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, ఎస్డీసీ మోహన్ సింగ్, పర్యాటక, ఉద్యానవన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




