Karimnagar: కరీంనగర్‌లో వైభవంగా పోచమ్మ తల్లి బోనాల జాతర!

Karimnagar: కరీంనగర్‌లోని భగత్ నగర్, రాంచంద్రపూర్ కాలనీల్లో పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 Aug 2026 7:31 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో వైభవంగా పోచమ్మ తల్లి బోనాల జాతర!

కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, స్థానిక ప్రజల జీవన విధానానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఆషాడమాస బోనాల పండుగ కరీంనగర్‌లో అత్యంత కోలాహలంగా జరిగింది. ఆషాడమాసాన్ని పురస్కరించుకుని నగరంలోని భగత్ నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం, మరియు రాంచంద్రపూర్ కాలనీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు.

ఈ బోనాల వేడుకలకు మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర వేడుకల్లో యాదగిరి సునీల్ రావు స్వయంగా నెత్తిన బోనమెత్తుకున్నారు. అనంతరం భారీ ఎత్తున మహిళలు పసుపు, కుంకుమలు, వేప మండలతో అందంగా అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని భక్తిశ్రద్ధలతో తరలిరాగ.. వారితో కలిసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, తెలంగాణ నేలకే తలమానికంగా నిలిచే ఈ బోనాల పండుగ మనందరి ఐకమత్యానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనమని కొనియాడారు."తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతికగా నిలిచే ఈ బోనాల పండుగను కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో, సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు. గ్రామ దేవతలైన పోచమ్మ తల్లి చల్లని చూపు కరీంనగర్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ ఆషాడ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సౌగాని కొమురయ్య, నలువాల రవీందర్, చొప్పరి జయశ్రీ -వేణు, పొన్నం లక్ష్మీ- మొండయ్య గౌడ్ మరియు భగత్ నగర్, రాoచంద్రపుర్ కాలనీ మున్నూరు కాపు సంఘం సభ్యులు, కుల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story