Karimnagar: తాగునీటికే ప్రాధాన్యత: యాసంగిలో వరి సాగు వద్దు

Karimnagar: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగు తగ్గించి, తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రత్యేక అధికారి మహేష్ దత్ ఎక్కా కలెక్టర్లను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 17 Oct 2026 5:27 PM IST
Karimnagar
X

Karimnagar: తాగునీటికే ప్రాధాన్యత: యాసంగిలో వరి సాగు వద్దు

కరీంనగర్: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, యాసంగి సీజన్‌లో వరి సాగును తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.

శనివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు చిత్రా మిశ్రా, బి. సత్యప్రసాద్, కోయ శ్రీహర్ష, గరిమ అగర్వాల్‌లతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, నీటి సంరక్షణ, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లో అమృత్ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులు ప్రజెంటేషన్ల ద్వారా వివరాలు అందించారు.

ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, కొత్తగా నీటి ప్రవాహాలు లేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రత్యేక అధికారి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల బోరుబావులు ఉండగా, వాటిలో 5 నుంచి 6 లక్షల వరకు పనిచేయని పరిస్థితి ఉందని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని తెలిపారు. యాసంగిలో వరి సాగుకు అవసరమైన నీటి లభ్యతపై అనిశ్చితి ఉన్నందున రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర భరోసా

వరి సాగును తగ్గించే క్రమంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతోపాటు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, అవసరమైన చోట డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు పండించే రైతులకు మార్కెటింగ్ సమస్యలు తలెత్తకుండా, కనీస మద్దతు ధర లభించేలా మార్కెటింగ్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రానున్న ఆరు నుంచి ఎనిమిది నెలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో తాగునీటి అవసరాలు, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ వినియోగం, ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ పనులపై ముందస్తు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.

విద్యుత్ వినియోగంపై నిరంతర పర్యవేక్షణ

రానున్న నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. కాలువల ద్వారా సాగునీరు అందని ప్రాంతాల్లో బోరుబావులపై ఆధారపడటం పెరిగితే విద్యుత్ వినియోగం అధికమై సబ్‌స్టేషన్లపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందన్నారు. ట్రాన్స్‌కో పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు, ఓవర్‌లోడ్, సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయి మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

ప్రస్తుత ఖరీఫ్ పంటలను రక్షించేందుకు కాలువల ద్వారా విడుదల చేసే నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా పర్యవేక్షించాలని, మధ్యలో మోటార్ల ద్వారా నీటిని తోడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. యాసంగిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంటల సాగుకు నీరు విడుదల చేసే అవకాశం లేదని, అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఉపాధి హామీ పనులతో నీటి సంరక్షణ

భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఉపాధి హామీ నిధులతో ఫామ్ పాండ్లు, మ్యాజిక్ ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ గుంతలు, కమ్యూనిటీ సోక్ పిట్లు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పూడిక, పిచ్చిమొక్కలను తొలగించే పనులు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూనే నీటి సంరక్షణ ఆస్తులను అభివృద్ధి చేయాలని తెలిపారు.

మున్సిపాలిటీల్లో అమృత్ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి, వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కరీంనగర్ జిల్లాలో వరి సాగు 33 శాతం తగ్గింపు లక్ష్యం

కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 7 శాతం తక్కువగా 681.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. దిగువ మానేరు జలాశయంలో 15.452 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు. యాసంగి 2026-27లో వరి సాగు విస్తీర్ణాన్ని 2,82,845 ఎకరాల నుంచి 1,89,063 ఎకరాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొక్కజొన్నను 60,177 ఎకరాలు, పప్పుధాన్యాలను 8,737 ఎకరాలు, నూనెగింజలను 8,566 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ పనులను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.

జగిత్యాల జిల్లాలో ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 9 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. భూగర్భ జలాలు గత ఏడాదితో పోలిస్తే సగటున 1.32 మీటర్ల లోతుకు వెళ్లాయని వివరించారు. తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ వనరులను సిద్ధంగా ఉంచామని, చివరి ప్రాంతాల్లో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రైతులను వరి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో తక్కువ నీటి పంటలకు ప్రోత్సాహం

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో 863 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణం కంటే 5 శాతం తక్కువని తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు నీటి ఎద్దడి లేదని వివరించారు. యాసంగిలో నీటి వనరులు సరిపోని ప్రాంతాల్లో వరి సాగును తగ్గించి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వాణిజ్య పంటలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. విద్యుత్ నెట్‌వర్క్ బలోపేతానికి కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సిరిసిల్ల జిల్లాలో వరి సాగు తగ్గింపునకు ప్రణాళిక

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణం కంటే 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. మధ్య మానేరు జలాశయంలో 23.42 టీఎంసీలు, దిగువ మానేరు జలాశయంలో 15.45 టీఎంసీలు, అప్పర్ మానేరులో 1.84 టీఎంసీలు, అన్నపూర్ణ జలాశయంలో 1.59 టీఎంసీలు, మల్కాపేట జలాశయంలో 1.24 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని వివరించారు.

మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ప్రతిరోజూ 59.41 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నామని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఒక్కొక్కరికి రోజుకు 135 లీటర్ల చొప్పున తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్ రూమ్‌లు, ప్రైవేట్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

యాసంగి 2026-27 సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని 1,90,988 ఎకరాల నుంచి 1,27,180 ఎకరాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వరికి బదులుగా 23,162 ఎకరాల్లో మొక్కజొన్న, 2,370 ఎకరాల్లో శనగ, 3,320 ఎకరాల్లో వేరుశనగతో పాటు ఆయిల్ పామ్, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. వ్యవసాయ విద్యుత్ ఫీడర్లకు రోజుకు సగటున 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, సబ్‌స్టేషన్ల బలోపేతం ద్వారా విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అక్టోబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు జిల్లాలో పశువులకు 3,28,475 మెట్రిక్ టన్నుల మేత అవసరం కాగా, 3,78,630 మెట్రిక్ టన్నుల మేత అందుబాటులో ఉందని, 50,154 మెట్రిక్ టన్నుల మిగులు ఉందని వివరించారు. పశువుల తాగునీటి కోసం కొత్త నీటి తొట్ల నిర్మాణం, పాత తొట్ల మరమ్మతులు చేపట్టడంతోపాటు, ఉపాధి హామీ నిధులతో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమీక్షలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీతో పాటు వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, మార్కెటింగ్, పశుసంవర్ధక, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA