Gambhiraopet: బాత్రూం వెళ్లాడని 4 ఏళ్ల బాలుడిని క్లాస్ బయట కూర్చోబెట్టిన స్కూల్!
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాత్రూం వెళ్లాడని నాలుగేళ్ల బాలుడిని బయట కూర్చోబెట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gambhiraopet: బాత్రూం వెళ్లాడని 4 ఏళ్ల బాలుడిని క్లాస్ బయట కూర్చోబెట్టిన స్కూల్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్ల బాలుడి పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. బాత్రూంకు వెళ్లాడనే కారణంతో ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని తరగతి గది నుంచి బయటకు పంపించి, దూరంగా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గంభీరావుపేటకు చెందిన నరసింహులు, దేవలక్ష్మి దంపతుల కుమారుడు కొంకటి యువాన్ (4) మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. బుధవారం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన బాలుడు బాత్రూంకు వెళ్లడంతో, తరగతి గది నుంచి బయటకు తీసుకొచ్చి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
చిన్న పిల్లలకు బాత్రూం అవసరాన్ని ముందుగా చెప్పే వయసు ఉండదని, అలాంటి పరిస్థితుల్లో వారిని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాఠశాల యాజమాన్యం ఇలా వ్యవహరించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నెలనెలా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం, చిన్నారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా, తమ పాఠశాలలో ఇలాగే ఉంటుందని, ఇష్టమైతే పిల్లాడిని పంపించాలని, లేదంటే మానుకోవాలని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు, ఈ ఘటనపై మండల విద్యాధికారి గంగారాంను వివరణ కోరగా, బాలుడి పట్ల ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై తనకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని పాఠశాల యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.




