Karimnagar: ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు..

Karimnagar: కరీంనగర్ సీపీఎం ఆఫీసులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు జరిగావు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 19 May 2026 3:37 PM IST
Karimnagar
X

Karimnagar: ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు.. 

కరీంనగర్: స్వాతంత్ర సమరయోధుడు,వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు,భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల వేగుచుక్క, కమ్యూనిస్టు గాంధీ,కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యగారి స్ఫూర్తితో జిల్లాలో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతి, కార్మిక,కర్షక ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. సమాజం పట్ల అతనికి ఉన్న ప్రేమ వర్ణించలేనిదని, పిల్లలు పుడితే స్వార్థం ఏర్పడుతుంది అని కుటుంబ నియంత్రణ చేసుకొని సమాజం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహానీయులని అన్నారు.

అగ్రవర్ణాలలో పుట్టి పేరు చివరన రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని కుల మతాలకతీతంగా, సమ సమాజ స్థాపనకు కృషి చేశారని , ఆనాటి కాలంలోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారని, కిరాణం కొట్టు పెట్టి లాభాలు లేకుండా పేద ప్రజలకు సరుకులు అందించారని, పార్లమెంటుకు సైతం సైకిల్ మీద వెళుతూ తన నిరాడంబరతను చాటుకున్న మహనీయులని అన్నారు. కుటుంబం నుండి తనకు సంక్రమించిన ఆస్తిని సైతం పేదలకు పంచిన గొప్ప వ్యక్తిఅని, ఆయన సేవలను కొనియాడారు.

కూలి సంఘాలు ఏర్పాటు చేసి, కనీస వేతనాల కోసం, రైతులకు గిట్టుబాటు ధర కోసం పోరాడారని, వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అనేకమంది పేదలను ఏకం చేసి, పోరాడిన వీరుడని అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ కుల వ్యవస్థను అంటరానితనాన్ని, అసమానతలను చిన్నతనంలోనే ఎదిరించాడన్నారు. కుల వివక్షతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.

నిత్యం ప్రజల కోసమే పరితపించిన గొప్ప మానవతావాది అన్నారు. దండాలు పెట్టే చేతులతో జెండాలు పట్టించి చెప్పు కింది బతుకులను నిప్పులా మండించిన ధీరుడు అన్నారు. ఎదురించడం తెలియని పీడితులకు పిడికిళ్ళు బిగించడం నేర్పాడన్నారు. మట్టి మనుషుల నుండి మహనీయులను తయారు చేశాడన్నారు. తెలంగాణ మాగాణంలో విప్లవాల విత్తనాలు చల్లి వీర గాధల్ని పండించిన యుద్ధ సేనాని సుందరయ్య అని కొనియాడారు.

తెలంగాణతో సుందరయ్యది విడదీయరాని విప్లవ బంధం అన్నారు. దేశానికి మతతత్వ రాజకీయాలు చేటు అని ఆనాడే చెప్పారన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రతి అంశాన్ని మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తుందన్నారు. దోపిడి పై, పీడనపై పోరు సల్పడమే సుందరయ్యకు నిజమైన నివాళి అన్నారు. సుందరయ్య స్ఫూర్తితో జిల్లాలో బలమైన వర్గ పోరాటాలు నిర్వహిస్తామన్నారు.

సుందరయ్య నిరంతరం పేదల పక్షపాతిగా తన జీవితాన్ని త్యాగం చేశారని నేటి సమాజంలో ఎదురవుతున్న ప్రజా సమస్యలపై పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునుటి శ్రీనివాస్, సుంకర సంపత్ , ఎడ్ల రమేష్ , డి నరేష్ పటేల్ జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయి కంటిశ్రీనివాస్ , పుల్లెల మల్లయ్య, పున్నం రవి,తేజవత్ రాజు,బి.అరవింద్,విజయ్, రాకేష్, సన్నీ, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story