Tangallapally: ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌తో మెరుగైన ఉపాధి

Tangallapally: తంగళ్లపల్లి గిరిజన మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేసి, ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులతో మెరుగైన ఉపాధి లభిస్తుందని తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 16 Nov 2026 11:23 PM IST
Tangallapally
X

Tangallapally: ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌తో మెరుగైన ఉపాధి

తంగళ్లపల్లి: విద్యార్థినుల్లో సృజనాత్మకత, వృత్తి నైపుణ్యాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌తో పాటు వివిధ వృత్తివిద్యా కోర్సుల ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.

సోమవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ రూమ్, తరగతి గదులు, వంటగదిని పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లతో పాటు కళాశాలలోని మౌలిక సదుపాయాలు, వసతులను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే భోజనం నాణ్యతను పరిశీలించి, నిర్దేశిత మెనూ ప్రకారం ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. కోర్సులో నేర్చుకుంటున్న అంశాలు, భవిష్యత్తులో లభించే ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అధ్యాపకులు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినులు ప్రతిరోజూ తరగతులకు హాజరవుతూ క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. తమలోని సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసి వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు తమ లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA