Sircilla: కోనరావుపేటలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం, భూముల రీ సర్వే పరిశీలన

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 7:50 PM IST
Sircilla
X

Sircilla: కోనరావుపేటలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం, భూముల రీ సర్వే పరిశీలన

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం పర్యటించారు. సుద్దాల గ్రామంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పత్తి కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లతో పాటు కేంద్రంలో రైతులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

రైతులు పత్తిని కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తేమ శాతం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అనంతరం కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే భూముల రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత సమయంలో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

రీ సర్వే పరిశీలనలో తహసీల్దార్ వరలక్ష్మి, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్, డీఐ రాజేంద్ర ప్రసాద్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA