Sircilla: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి - కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సత్వర పరిష్కారానికి ఆదేశాలు.

KALEEM, SIRICILLA
Published on: 5 Oct 2026 4:07 PM IST
Sircilla
X

Sircilla: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి - కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 115 అర్జీలు అందగా.. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఒక దరఖాస్తు, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో మూడు దరఖాస్తులు అందాయి. వీటిని సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల్లో 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రజావాణి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించారు. మండలాల వారీగా బోయినపల్లిలో 2, చందుర్తిలో 2, ఇల్లంతకుంటలో 3, గంభీరావుపేటలో 6, కోనరావుపేటలో 6, ముస్తాబాద్‌లో 7, రుద్రంగిలో 0, తంగళ్లపల్లిలో 4, వీర్నపల్లిలో 2, వేములవాడ అర్బన్‌లో 3, వేములవాడ రూరల్‌లో 7, ఎల్లారెడ్డిపేటలో ఒక దరఖాస్తు చొప్పున అందాయి.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని, స్థానిక ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని తెలిపారు. అందిన దరఖాస్తులను అన్ని చోట్ల ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA