Sircilla: సిరిసిల్ల ఐడీఓసీ ప్రజావాణిలో 190 దరఖాస్తుల స్వీకరణ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఐడీఓసీ ప్రజావాణిలో 190 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Sircilla: సిరిసిల్ల ఐడీఓసీ ప్రజావాణిలో 190 దరఖాస్తుల స్వీకరణ!
Sircilla: ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 190 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో 6, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 4 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం రెండు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కలిపి 10 దరఖాస్తులు స్వీకరించారు.
మండలాల్లో 126 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించారు. మండలాల వారీగా బోయినపల్లి 24, చందుర్తి 2, ఇల్లంతకుంట 9, గంభీరావుపేట 8, కోనరావుపేట 5, ముస్తాబాద్ 12, రుద్రంగి 0, తంగళ్లపల్లి 32, వీర్నపల్లి 9, వేములవాడ అర్బన్ 2, వేములవాడ రూరల్ 11, ఎల్లారెడ్డిపేట 12 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఎంపీడీఓ కార్యాలయాల్లో 126 దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
ఐడీఓసీతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఆయా కార్యాలయాల్లో అందించాలని సూచించారు.
అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు. ఐడీఓసీ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.




