Sircilla: ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Oct 2026 2:44 PM IST
Sircilla
X

Sircilla: ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

సిరిసిల్ల: ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలను గురువారం ఆమె పరిశీలించారు.

తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు 278, 279లో నిర్వహిస్తున్న శిబిరాన్ని సందర్శించి, ఓటర్ నమోదుకు వస్తున్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫారం-6 ద్వారా మొత్తం 12 దరఖాస్తులు వచ్చినట్లు బూత్ లెవల్ అధికారి కలెక్టర్‌కు వివరించారు. నూతన ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 16న కూడా ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. తొలిసారి ఓటరుగా నమోదు కావాలనుకునే యువత తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత శిబిరాల సమయంలో సంబంధిత బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదని కలెక్టర్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్ బాబు, ఇన్‌చార్జి తహసీల్దార్ మురళి, సర్పంచ్ చిలువేరి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA