Sircilla: పెండింగ్ కేసులు త్వరగా తేల్చాలి: ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల వేగవంత పరిష్కారానికి ఎస్పీ మహేష్ బి. గితే క్రైమ్ సమీక్ష నిర్వహించి పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Sircilla: పెండింగ్ కేసులు త్వరగా తేల్చాలి: ఎస్పీ మహేష్ బి. గితే!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి. గితే నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ.. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్షీట్ల దాఖలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు.
పోలీసు అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్ధతతో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని, పోక్సో కేసుల్లో దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్షీట్ల దాఖలు, కోర్టు విచారణకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించారు. ప్రతి అధికారి తన పరిధిలోని సిబ్బంది పనితీరు, ప్రవర్తన, విధుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లాలో దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై అప్రమత్తంగా ఉంటూ నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, జూదం, అక్రమ ఇసుక రవాణా, అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రజల భద్రతను బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ను నిరంతరం కొనసాగించాలని ఎస్పీ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన శోభాయాత్ర ముగిసే వరకు ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




