Sircilla: సిరిసిల్లలో మెడికల్ మాఫియా దోపిడీపై ప్రచార కరపత్రాల విడుదల!
Sircilla: రాజన్న సిరిసిల్లలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల దోపిడీపై ప్రచార పత్రాలు విడుదల చేశారు. అధిక ధరలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Sircilla: సిరిసిల్లలో మెడికల్ మాఫియా దోపిడీపై ప్రచార కరపత్రాల విడుదల!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రైవేట్ ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరికరాల పేరుతో రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి ఆరోపించింది. ఈ నేపథ్యంలో వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమితి అధ్యక్షుడు బుస్స వేణు ఆధ్వర్యంలో సిరిసిల్లలో ప్రత్యేక ప్రచార కరపత్రాలను విడుదల చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినికల్ ల్యాబ్‌లు, మెడికల్ షాపుల్లో కొన్ని చోట్ల అవసరం లేని వైద్య పరీక్షలు సూచించడం, మందులు, వైద్య పరికరాలకు అధిక ధరలు వసూలు చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని సమితి నాయకులు పేర్కొన్నారు.
ప్రచార కరపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఐవీ సెట్ ధర రూ.20 కాగా, ఆసుపత్రుల్లో రూ.450 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పిల్లల ఆక్సిజన్ మాస్క్ ధర రూ.200గా పేర్కొంటూ, రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. నెబ్యులైజర్ మాస్క్ ధర రూ.70గా ఉండగా, రూ.400 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారని ప్రచార పత్రంలో ప్రస్తావించారు. అలాగే పిల్లలకు ఆక్సిజన్ అందించేందుకు గంటకు రూ.500 వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
వైద్య సేవలకు సంబంధించిన ఖర్చులు, మందులు, వైద్య పరికరాల ధరలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సమితి నాయకులు సూచించారు. ప్రచార కరపత్రంలో పేర్కొన్న ధరల వ్యత్యాసాలపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని, నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని కోరారు.




