Sircilla: మొబైల్ రికవరీలో సిరిసిల్ల పోలీసుల హ్యాట్రిక్ రికార్డ్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వరుసగా 3వ ఏడూ మొబైల్ రికవరీలో రాష్ట్రంలోనే నెంబర్ 1. రూ.13 లక్షల విలువైన 90 ఫోన్లు యజమానులకు అప్పగింత.
Sircilla: మొబైల్ రికవరీలో సిరిసిల్ల పోలీసుల హ్యాట్రిక్ రికార్డ్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి మొబైల్ ఫోన్ రికవరీలో మరోసారి విశిష్ట ఫలితాలు సాధించారు. 76.8 శాతం మొబైల్ రికవరీ రేటుతో రాష్ట్రంలో వరుసగా మూడో సంవత్సరం ప్రథమ స్థానంలో నిలిచారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్‌ఫోన్ రికవరీ మేళాలో రూ.13 లక్షల విలువైన 90 పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అందజేశారు. ఈ ఫోన్లను తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మొబైల్‌లో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఉండటంతో ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకోవాలని, దొంగిలించిన మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొబైల్ రికవరీలో విశేష కృషి చేసిన ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. తమ పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి అందడంతో బాధితులు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.




