Sircilla: యూడీఐడీ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Sircilla: యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ గరిమ అగ్రవాల్.

KALEEM, SIRICILLA
Published on: 31 Oct 2026 11:12 PM IST
Sircilla
X

Sircilla: యూడీఐడీ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించి, యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

యూడీఐడీ దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ అంశాలపై శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ.. యూడీఐడీ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, సెర్ప్ ద్వారా జిల్లా ఆసుపత్రులకు పంపిన వైద్య పరీక్షల యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రులకు వచ్చే వారికి అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు ఆసుపత్రికి వచ్చిన రోజే పరీక్షలన్నీ పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంల పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో యూడీఐడీ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2025 మార్చి 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 3,590 యూడీఐడీ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శరత్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA