Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే

Sircilla: సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో సైబర్ భద్రతపై ఎస్పీ మహేష్ గితే అవగాహన సదస్సు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Sept 2026 7:57 PM IST
Sircilla
X

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే

సిరిసిల్ల: సైబర్‌ నేరాల నివారణలో ముందస్తు అప్రమత్తత ఎంతో ముఖ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. విద్యార్థులు సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జిల్లా సైబర్‌ టీమ్ ఆధ్వర్యంలో నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్‌ యుగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్‌ లింకులు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్‌ ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని చెప్పారు.

తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌, సందేశాలు, లింకులను నమ్మవద్దని సూచించారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, సీవీవీ, ఆధార్‌, పాస్‌వర్డ్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

వినాయకుడి బోధనలతో సైబర్‌ భద్రతపై అవగాహన

వినాయక చవితి సందర్భంగా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన ‘వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు’ అనే అవగాహన పోస్టర్‌ను ఎస్పీ విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. సైబర్‌ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించేలా పోస్టర్‌ను రూపొందించారు.

వివిధ సైబర్‌ మోసాలపై అవగాహన

జిల్లా సైబర్‌ సెల్‌ టీమ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విద్యార్థులకు వివిధ రకాల సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించింది. లోన్‌ యాప్స్‌, షేర్‌ మార్కెట్‌, ఏపీకే ఫైల్స్‌, కొరియర్‌ ఫ్రాడ్‌, క్రెడిట్‌ కార్డ్‌ మోసాలు, మ్యాట్రిమోని, లాటరీ, గిఫ్ట్‌ ఫ్రాడ్‌లు, మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌, క్రిప్టో కరెన్సీ, డిజిటల్‌ అరెస్ట్‌, సోషల్‌ మీడియా మోసాలపై వివరించారు.

సైబర్‌ మోసానికి గురైన వెంటనే భయాందోళనకు గురికాకుండా 1930కు కాల్‌ చేయాలని లేదా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ “Prevention is Better than Cure” అన్న విధంగా సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. తమకు అందించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని, సైబర్‌ నేరాల నివారణలో తమ వంతు బాధ్యతగా కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్‌, సైబర్‌ క్రైమ్‌ ఎస్‌ఐ జునైద్‌, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అనిత, సైబర్‌ సెల్‌ సిబ్బంది గంగిరెడ్డి, రాజు, శ్రీకాంత్‌, విజయ్‌, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story