Sircilla: నేర నియంత్రణపై ప్రత్యేక నిఘా ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి. గితే. కేసుల దర్యాప్తు, నేర నియంత్రణపై అధికారులకు ఆదేశాలు.

KALEEM, SIRICILLA
Published on: 10 Nov 2026 12:59 PM IST
Sircilla
X

Sircilla: నేర నియంత్రణపై ప్రత్యేక నిఘా ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, కేసుల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలను సమీక్షించారు.

నేర నియంత్రణపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రౌడీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్ పరిధిలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన కేసుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. స్టేషన్ రికార్డులు, రిజిస్టర్లను క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కేసులకు సంబంధించిన వాహనాలను భద్రపరచాలని ఆదేశించారు.

బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, గ్రామాల్లో రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ తనిఖీలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఉపేంద్రచారి, లక్పతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA