Yellareddypet: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం!
Yellareddypet: దూమల ఏకలవ్య మోడల్ స్కూల్‌ను సందర్శించిన రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితే.. ఉపాధ్యాయులకు సన్మానం, విద్యార్థులకు దిశానిర్దేశం
Yellareddypet: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం!
Yellareddypet: విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ, వారి లక్ష్య సాధనకు మార్గనిర్దేశం చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దూమల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, సాధించాలనుకుంటున్న ఆశయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.
మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని అందించి, సరైన మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
“నేను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఈ స్థాయిలో ఉన్నానంటే.. నాకు విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గాన్ని చూపించిన నా గురువుల పాత్ర ఎంతో ఉంది” అంటూ తన గురువులను ఎస్పీ ఈ సందర్భంగా ఆత్మీయంగా గుర్తు చేసుకున్నారు.
గురువులు విద్యార్థులకు దిక్సూచి వంటివారని, వారు చూపిన మార్గంలో క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మహేష్ బి. గితే అన్నారు.
విద్యార్థుల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, సేవలను కొనియాడిన ఎస్పీ.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. విద్యార్థి దశలో సోషల్ మీడియా, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్‌ఐలు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




