Sircilla: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి 25న స్పాట్ కౌన్సెలింగ్: కలెక్టర్!

Sircilla: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆగస్టు 25న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 18 Aug 2026 11:34 PM IST
Sircilla
X

Sircilla: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి 25న స్పాట్ కౌన్సెలింగ్: కలెక్టర్!

సిరిసిల్ల: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీతో పాటు విద్యార్థులకు అందుతున్న ఉపకార వేతనాలపై జిల్లా కలెక్టర్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదువుతున్న 1,571 మంది ప్రీ మెట్రిక్ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో గత విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.35.66 లక్షల ఉపకార వేతనాలు జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే 712 మంది పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఖాతాల్లో రూ.1.02 కోట్లకు పైగా ఉపకార వేతనాలు జమ చేసినట్లు వెల్లడించారు.

గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 25న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, గంభీరావుపేట మండలం నర్మాల, సిరిసిల్ల చిన్నబోనాల, బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ, ముస్తాబాద్ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీజీటీ విభాగాల్లో పలు సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత తేదీన అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల జోనల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గురుకులాల డీసీఓ థెరిసా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story