Sircilla: రాష్ట్రస్థాయి యూత్ పార్లమెంట్ పోటీలకు ముగ్గురు ఎంపిక!

Sircilla: రాజన్న సిరిసిల్లలో మై భారత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నిర్వహించారు. వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Nov 2026 11:56 PM IST
Sircilla
X

Sircilla: రాష్ట్రస్థాయి యూత్ పార్లమెంట్ పోటీలకు ముగ్గురు ఎంపిక!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మై భారత్ మేరా యువ భారత్, బి.జె.ఆర్. వ్యవసాయ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026-27’ కార్యక్రమాన్ని నవంబర్ 11న ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ‘నషా ముక్త్ యువ – డ్రగ్ ఫ్రీ ఇండియా’ అనే అంశంపై జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సామాజిక, సమకాలీన అంశాలపై తమ అభిప్రాయాలను ప్రసంగాల రూపంలో వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి.జె.ఆర్. వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజం, దేశ పురోగతి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇలాంటి యూత్ పార్లమెంట్ పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ సామర్థ్యాలను, వక్తృత్వ నైపుణ్యాలను వెలికితీసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమని అన్నారు.

పోటీల్లో విజేతలు వీరే..

వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

మొదటి బహుమతి: దీప్తి రాయ్ – ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రాజన్న సిరిసిల్ల.

రెండో బహుమతి: ఎస్.కె. రామిజ్ రాజా – ప్రభుత్వ వైద్య కళాశాల, రాజన్న సిరిసిల్ల.

మూడో బహుమతి: సి.హెచ్. అవినాష్ రెడ్డి – రాజన్న సిరిసిల్ల.

ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి గోలీ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మై భారత్ జిల్లా కార్యక్రమ అధికారి జి. కిరణ్ కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ రజియా, తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ డాక్టర్ అంజయ్య, నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ నవ్య, సైకాలజిస్ట్ పున్నం చందర్, మై భారత్ ప్రతినిధులు లోపెల్లి రాజు, అక్కెం నాగరాజు, సాయి అక్షయ్‌తో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA