Sircilla: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ సన్మానించారు.
Sircilla: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం!
Sircilla: విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉపాధ్యాయులకు సూచించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాకు చెందిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం మిగతా ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల బోధనలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మనోవికాసంతో పాటు సామాజిక విలువలు, కట్టుబాట్లు, క్రమశిక్షణ వంటి అంశాలను బోధించాలని అన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు.
విద్యకు అధిక ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే 11 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభించామని, జిల్లాలో మరో రెండు పాఠశాలలు రానున్నాయని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.
డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
విద్యార్థులకు టీచర్లే రోల్ మోడల్స్
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధ్యాయులే రోల్ మోడల్స్ అని అన్నారు. తన విద్యార్థి దశలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం విద్యార్థుల జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో జిల్లాలో ఉపాధ్యాయులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించారని కలెక్టర్ అభినందించారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI), విద్యార్థుల నమోదు తదితర అంశాల్లో జిల్లా మెరుగైన పనితీరు కనబరిచిందని తెలిపారు.
ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థి ఇష్టపడే ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టును కూడా విద్యార్థి ఇష్టపడతారని అన్నారు. అందువల్ల ప్రతి ఉపాధ్యాయుడి ప్రవర్తన, బోధనా విధానం విద్యార్థులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 37 మందికి అవార్డులు, సన్మానం అందించారు. హెచ్‌ఎంలు, పీడీలు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, కేజీబీవీ ఎస్‌ఓ, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు, ఐఈఆర్పీలకు అవార్డులు అందజేశారు.
అవార్డులు పొందిన వారిలో చిట్నేని శ్రీకాంత్ రావు, టీ. మనోహరాచారి, ఆడెపు రాజేశం, అజ్మీరా మదన్ లాల్, గుర్రం సందీప్, నర్ర శ్రీనివాసరెడ్డి, టీ. మధుకర్ రెడ్డి, గంప లక్ష్మీనారాయణ, ఎం. లక్ష్మయ్య, మొహమ్మద్ రహీం, సీహెచ్. రమాదేవి, ఎం. కోటేశ్వర్, కొప్పు రాములు, వెంగల మహేష్, మాదాడి వెంకటరావు, కుమ్మరి మల్లేశం తదితరులు ఉన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, జిల్లా విద్యాధికారి మొండయ్య, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




